Thursday, 20 November 2014

ఇన్ షా అల్లాహ్


మనిషి ఆశా జీవి. ఆశల వీధుల్లో విహరించడం, కొత్త కొత్త తోటలు పెంచుకోవడం అతని అభిరుచి. ఏమేమో చేయాలని, ఎన్నెన్నో సాధించాలని అనుకుంటాడు, సాధించే పథకాలు పకడ్బందీగానే నిర్మించుకుంటాడు కూడా. అంతే కాదు తన కృషికి, ప్రయత్నాలకు తగినట్లు ప్రకటనలు కుడా చేస్తాడు. తాను చేయదలచుకున్నదంతా చాటి చెబుతాడు. ఎన్నో ప్రగాల్భాలు పలుకుతాడు. కొన్ని పర్యాయాలు డాంబికాలు కాక చిత్త శుద్ధితో కృషి జరపాలన్న సంకల్పంతోనే పలుకుతాడు. కాని వాస్తవంగా మనిషి ఏమి చెయ్యలేడు. ప్రపంచంలో ”చక్రం” మొదలుకుని ప్రగతి వికాసాల బాటన ”రాకెట్టు” వరకు కనిపెట్టి భూతలం మీదే కాకుండా గగనతలంలోనూ స్వేచ్ఛావిహారం సాగిస్తున్నవాడు మనిషే! అయినా మనిషి చెయ్యగలిగింది బహు స్వల్పం. నిఖిల జగత్తును తన హస్తగతం చేసకుని అనుక్షణం థాదిశల నిర్దేశనలతో విశ్వాన్ని నడుపుతున్న ప్రభువు, స్వామి, దైవం చెయ్యనివ్వనిదే, ఆయన అనుజ్ఞ, ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు, మనిషి ఏమీ చెయ్యలేడు, మనిషి చెయ్యగలిగింది ఏమీ లేదు!!
ఒక్క చిన్న సంఘటన, అనుదినం సంభవించే ఒక సాధారణమయిన ఉదంతం మానవ నాగరికతలో అంతులేని పరివర్తనకు కారణ మవుతుంది; చెట్టు నుండి రాలే ఒక యాపిల్‌ పండు, ఉడికే టీ పాత్రపైన కదలిన మూత వల్ల మనిషి ప్రగతి వికాసాల ఎత్తయిన సోపానాలనెక్కగలిగే స్థోమతను సంపాదించాడు. ఇది వాస్తవమే, కాని ఆ సందర్భాల కల్పన, సర్వసాధారణమైన ఆ సందర్భాలలో మనిషి ఆంతర్యాన జనించిన ప్రేరణలు దైవికమైనవే తప్ప మరెమీ కావు. మనిషి ఊహాతీతంగా ఎదురయిన ఘటనల వలెనే మనిషి ఆలోచనల్లోని ఊహాసౌధాలన్నీ ఒక్క ప్రకృతి కుదుపుతో కూలి నేలమట్టమయిన సంఘటనలు కోకొల్లలు. అందుకే మానవ సమాజంలో అనుభవాల సారంగా ఏర్పడిన అనేక నానుడులలో ఒకటి ”తానొకటి తలిస్తే దైవమొకటి తలచును” అన్నది. మనిషి ఎన్నో ఆశల ఆకాశహర్మ్యాలు నిర్మించుకుని, ప్రకటించుకుని, భావనల భవంతుల్లో, బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో, ఓడల్ళో ప్రయాణిస్తూ ఉంటాడు. ”దుర్ఘటనలు”గా పేర్కొనబడే అనేక సంఘటనల్లో మనిషి మేనుతోపాటు ఆ మేడలు సైతం అంతుపట్టకుండా పోతాయి. ఏ ప్రయాణం చెయ్యకపోయినా ఇంటిపట్టున కూర్చున్నవాని ఆలోచనలకు, ఆచరణలకు, ఆవేశాలకు అడ్డుకట్టగా ”ప్రకృతి వైపరీత్యాలు” అనబడే ప్రకృతి పరిణామాలు లేక ఆరోగ్య సంబంధమయిన అపశృతులు సంభవించి అంతా క్షణాలలో తల్లక్రిందులైపోతుంది.
ఇవన్నీ చాటిచెబుతున్నదేమిటి? సర్వస్వతంత్రుడయిన మనిషి సంపూర్ణ స్వతంత్రుడు కాడు. అనుకున్నవన్నీ చెప్పడానికి, చెప్పినవన్నీ నెరవేరడానికి అతని ఒక్కని ప్రమేయంతోటే విశ్వ కార్యకలాపాలు సాగటం లేదు. కోటానుకోట్ల మానవులందరిపైనా, వారి ఆశలపైనా, వారి ఆశయాలపైనా, వారి ఆక్రందనలపైనా, ఆక్రోశాలపైనా సర్వాధికార మున్న స్వామి, విశ్వం అంతటికీ ప్రభువు అయిన దైవం, ఆ దేవుని అభీష్టం, అభిమతం, మనిషి తన పథకాన్ని కార్యాచరణ ద్వారా పరిపూర్ణం చేస్తున్నట్లు కనిపించినా అసలు నిర్వాహకుడు ఆ ప్రభువే. అదే మరచిపోవద్దని హెచ్చరిస్తున్నాడు నిజ ప్రభువు:
”ఏ పనినయినా ‘నేను, రేపు తప్పక చేస్తానని ఎంత సేపటికీ గట్టిగా చెప్పనేరాదు. అయితే వెంటనే ‘ఇన్ షా అల్లాహ్’ (దైవం తలచినట్టయితే) అని పలకాలి. ఇంకా ఎప్పుడైనా మరపు సంభవిస్తే, ‘నా ప్రభువు నన్ను మరంత సన్మార్గానికి, సన్నిహితమయిన మాటకు దారి సచూపుతాడ’ని చెప్పాలి”. (అల్‌ కహఫ్‌: 23,24)
ఇస్లాం మనిషికి నేర్పే సంస్కృతీ నాగరికతల్లో ఒకటి, మనిషి తన శక్తి సామర్ధ్యాలపైన మిడిసిపాటుకు గురికాకుండా తన సృష్టికర్త అయిన దైవం పైన భారం మోపడం. దైవం మీద భారం మోపే ఆ స్పృహను, ఆ చేతనను నిత్యం జాగృతంగా, తేజోవంతంగా, చలనవిహితంగా ప్రజ్వలింపజేయడానికి భవిష్యత్తును గురించి పలికేటప్పుడు- అది ఎంతటి సాధారణమయిన విషయమయినా, ఎంతటి తథ్యమయిన అంశమయినా, ఎంతటి అచంచల నిశ్చిత, నిర్ధారిత కార్యక్రమయినా – ‘ఇన్షాఅల్లాహ్‌ా’ అన్న పద బంధంతో కలిపే పలకాలి అన్న విధ్యుక్త ధర్మాన్ని బోధించింది ఇస్లాం. దైవం మీద భారం మోపే స్పృహతో పాటు ఆ కార్యనిర్వహణకు దైవ సహాయాన్ని అర్ధించే ప్రేరణ కూడా తద్వారా ప్రాప్తమవుతుంది. ఏదో లాంఛనంగా కాక సచేతనంగా పలికే ఆ మాటలకు, దాని వెనక దేవుని ఇష్టం కూడా తోడవ్వాలన్న ప్రబల వాంఛ గోచరిస్తుంది. మనిషి చిత్తశుద్ధితో దైవాన్ని సహాయం అర్ధిస్తే అది ప్రాప్తించడంలో ఆశ్చర్యమేముంది?
‘ఇన్ షా అల్లాహ్’ అన్న పద బంధం ప్రయోగించబడిన ఖుర్‌ఆన్‌ ఆయతులను కొన్నింటిని పరిశీలిద్దామా?
తల్లిదండ్రులకు దూరమయిన మహనీయ యూసుఫ్‌ (అ)ని రకరకాలుగా బాధపెట్టిన సోదరులు చివరికి ఆయన్నే ఆశ్రయించగా ఆయన ఈజిప్టు సర్వాధికారిగా వారిని ఆదుకోవలసి వచ్చినప్పుడు ఆయన ఎంతో ఉదారంగా వారిని ఆహ్వానించారు. తల్లిదండ్రుల్ని సయితం తీసకురమ్మని కోరారు. అలా వారు వచ్చినప్పటి సందర్భం: అప్పుడు ఆ పరివారమంతా యూసుఫ్‌ వద్దకు చేరినప్పుడు యూసుఫ్‌ తల్లిదండ్రులకు తన చెంత చోటు కల్పించాడు. ఇలా అన్నాడు, ‘దేవుడు సమ్మతిస్తే’ మీరంతా శాంతిభద్రతలతో ఈజిప్టులోకి ప్రవేశిస్తారు. (యూసుఫ్‌: 99)
హజ్రత్‌ మూసా (అ), దైవం నియమించిన ఒక జ్ఞాని అయిన వ్యక్తితో కలిసి ప్రయాణానికి సమాయత్తమయినప్పుడు ఆ జ్ఞాని, మీరు నా చేష్టలకు ఓపిక పట్టలేరు అని అన్న సందర్భంలో:
మూసా ఇలా సమాధానం పలికారు: ”దైవం కోరినట్టయితే మీరు నన్ను సహనశీలునిగా గుర్తిస్తారు, నేను ఏ విషయంలోనూ మీ పట్ల అవిధేయతకు పాల్పడను”. (అల్‌ కహఫ్‌: 69)
మహనీయ మూసా (అ) ఈజిప్ట్‌ నుండి బయలుదేరి మద్‌యన్‌ వెళ్ళి ఒక కుటుంబంలో పనికి చేరినప్పుడు ఆ ఇంటి యజమాని ఆయన్ని తన ఇంట పని చేసే ఒడంబడిక చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు:
”….మీరు ఎనిమిదేళ్ళు మా ఇంట పని చేయాలి. మీరు ఒకవేళ పదేళ్లు పూర్తి చేసినట్టయితే అవి మీ పక్షాన ఉత్తమ ప్రవర్తనగా భావిస్తాను, నేను మిమ్మల్ని కష్టపెట్టాలని అనుకోవటం లేదు. దైవం తలచినట్టయితే మున్ముందు మీరు నన్ను సజ్జనునిగా కనుగొంటారు”. (అల్‌ ఖసస్‌: 27)
మహనీయ ఇబ్రాహీమ్‌ (అ) తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని బయలుదేరిన తర్వాత అతన్ని సంబోధించి, ”నా చిట్టీ, నేను నిన్ను జిబహ్‌ (వధ) చేస్తున్నట్లు కల గన్నాను, ఇక నీ అభిప్రాయమేమిటో నాకు చెప్పు” అని పురమాయించినప్పుడు హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అ) ఇలా అన్నారు:
”నాన్నగారూ, మీకు ఆదేశమయినట్లే మీరు ఆచరించండి. ‘దైవం తలచితే’ నన్ను మీరు సహనశీలునిగానే చూస్తారు”. (అస్‌ సాప్ఫాత్‌: 102)
సజ్జనుడైన దైవ భక్తుడు, ఎన్నడూ తన నైతిక బలాన్ని, బుద్ధిబలాన్ని, భుజబలాన్ని, అంగబలాన్ని ఆసరాగా తీసుకుని ప్రగల్భాలు పలకడు. వినయవినమ్రతలతో దైవంపై భారం మోపి భావిని గురించి తన సంకల్పాన్ని వ్యక్తం చేస్తాడు. ఇది దైవ భక్తుని విధానం – ఇన్షాఅల్లాహ్‌ా!
(‘తూరుపుతావి’ పుస్తకం నుండి)

మహా నగరిలో మహా ప్రవక్త మహితోక్తులు



సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

మానవ సృష్టికి మునుపే ఫరిష్తాల కాలం నాటిది కాబా గృహం. ఆకాశంలో దైవ దూతల ఆరాధనా  క్షేత్రం బైతుల్‌ మామూర్‌ అయితే, అవనిలో మనుజ భక్తుల ప్రార్థనాలయం ఈ ప్రతిష్ఠాలయం. భువిలో తొలి దైవ గృహం, భూతల స్వర్గం ఈ గృహం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) హృదయాలను ఏలిన మహీతలం మక్కా నగరం. అనాదిగా ఈ గృహం విశ్వ మానవ మార్గదర్శక కేంద్రం. 

ఇదో విశిష్ఠతైతే...
ఈ పుణ్య  క్షేత్రానికి దైవ ప్రవక్తలందరూ తమ జీవితకాలంలో  ఏదో ఒక సందర్భాన వచ్చి దర్శించుకున్నట్లు, వారిలోని అనేక మంది ప్రవక్తలు తమ శేషజీవితాన్ని ఇక్కడే గడిపినట్లు అమరవీరులై కీర్తిశేషులైనట్లు చరిత్ర చెబుతోంది.
  
  ఈ మహా నగరాన్నే పూర్వం 'బక్కా' అని పిలిచేవారు. ఎట్టి శత్రువునయినా ఇట్టే  క్షమించి వదిలేయాలన్నది దానర్థం. ఎంత మధురం! ఎంత మనోహరం - మక్కా నగరం!! బైబిల్లో, పురాణాల్లో, ప్రపంచ ఇతిహాసాల్లో - అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌లో - ఈ పవిత్ర పురం గురించి ఎన్నో వర్ణనలు, ఉదంతాలు ఉన్నాయి. ప్రవక్తల పితామహులు హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) తన పుత్ర రత్నంతో కలిసి ఈ పవిత్ర గృహాన్ని పునర్నిర్మించారన్నది ప్రసిద్ధిగాంచిన ప్రతీతి. ఆ కుమారుని పేరు ఇస్మాయీల్‌. ప్రవక్త (స) వారి వంశానికి మూల పురుషుడు, వారిరువురి ప్రార్థనా ఫలితమే మహా  ప్రవక్త  ముహమ్మద్‌   (స)   వారి  ప్రభవనం. ముహమ్మద్‌ (స) వారు ప్రభవింపజేయబడింది ఈ నగరంలోనే.   

  ఆ నగరం భక్తిపరులకు ఆలవాలం. సత్యసంధులకు పంట పొలం. సాత్వికులకు, శాంతి ప్రియులకు ఆలయం. అటువంటి మహా నగరం కొన్నేళ్ళుగా అంధకారాలతో, మూఢ నమ్మకాలతో అతలాకుతలమవుతూ ఉంది. అట్టి తరుణంలో ప్రకృతి ధర్మాన్ని , సంపూర్ణ ధర్మ శాస్త్రాన్ని, అంతిమ గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని అనేక రేఖల్లో, రూపాల్లో - అక్షరాల్లో - ఆచరణల్లో అభిషేకించేందుకు వచ్చారు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స). నీతి నడవడికలు, సత్యం ధర్మాల రీత్యా ఆయనో మహోన్నత పర్వత శిఖరం. అందునుండి ఎన్నో సెలయేర్లు లకం నలుదిశలా ప్రవహించి - మహా నదులై - ఎందరెందరో సత్యార్తిని తీర్చి - అనంత, అద్భుత, అద్వితీయ ఆదర్శప్రాయుల్ని చేశాయి. 
  ఇవీ ఆ పవిత్ర పురానికీ, పుర ప్రవక్తకు సంబంధించిన కొన్ని పూర్వేతిహాసాలు. ఇక ఆ నగరంలో ఆయన చిలికించిన అమృత జల్లులు, ఆదర్శ పలుకుల గురించి తెలుసుకుందాం! పవిత్రమైన మార్గదర్శక కేంద్రాన్ని ఫలవంతం చేయడానికీ, ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడానికి నిర్మలమైన దివి నుండి కురిసిన కారుణ్య జల్లే, అంతరాత్మ హరివిల్లే అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స). అజ్ఞానులకు జ్ఞానకాంతులనిచ్చి, చీకట్లలో మ్రగ్గుతున్న  జనాలకు వెలుగు బాట చూపి సత్య మార్గాన శాంతి పథాన నడిపించేందుకు ఆవిర్భవించిన క్రాంతికారుడే, శాంత మూర్తియే కారుణ్య ప్రవక్త ముహమ్మద్‌ (స ).

  తెల్లవారు జామున మంచు కురిసే వేళలో ఎడారి ఓడల   క్ష్షీరసాగరాలు, పక్షుల కిల కిలారావాలు, అండ పిండ బ్రహ్మాండాల స్తుతిగీతాల, ప్రత్యూషాల దైవన్నామ స్మరణలు, రెక్కల్లో తల దూర్చి ఆత్మ పరిశీలన చేసు కుంటున్న పక్షులు - అప్పుడే తొలిజాము తొలి కోడి కూసింది. చల్లని నీటితో వుజూ చేసుకుని పవిత్ర భావాలతో పరమోన్నతుడి సన్నిధిలో మోకరిల్లేందుకు బయలుదేరారు ప్రవక్త శిఖామణి (స). మలి కోడి కూసే వేళకు ప్రార్థన పూర్తి చేసుకుని దివ్యగ్రంథ పఠనంలో లీనమైనారు. ప్రపంచ  చీకట్లను పటా పంచలు చేసేందుకు ఆ ప్రభాకరుడు పగటి పూట ఉదయిస్తే, ప్రజల జీవితాల్లో వెలుగును నింపేందుకు నిద్రను త్యజించి నిశిరాత్రి ప్రార్థనల్లో ప్రభువు సన్నిధానంలో ప్రణమిల్లు తున్నాడు ఈ ధర్మ ప్రభాకరుడు. ఆ రవికిరణం చీకటి పడ్డాక కనుమరుగైపోతే, ఈ రవితేజం రాత్రిళ్లు సైతం తేజోవంతమై వెలుగు నందిస్తున్నాడు. తెల్ల వారింది... సూర్య కాంతులతో తడి స్నానాలు చేస్తోందీ లోకం. ప్రియ ప్రవక్త (స) వారు ప్రజల జీవితాలను జ్యోతిర్మయం చేసేందుకు, వారి అంతరాత్మ చక్షువుల్ని తెరిచేందుకు,  మొద్దు నిద్ర నుండి వారిని తట్టి లేపేందుకు, వాస్తవ జగత్తులో, సత్యామృతంలో జలకాలాడించేందుకు, వారి పుట్టుకకు పరమార్థాన్నిచ్చేందుకు, వారి బ్రతుకు బాట సరి చేసేందుకు,  వారి ఉనికికి లక్ష్యాన్ని బోధించేందుకు, వారి జీవితాల్ని పునీతం చేసేందుకు, వారి జన్మను ధన్యం గావించేందుకు బయలు దేరారు దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). 

  మనిషి జీవితానికి అర్థాన్నిచ్చే అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స). సత్యవంతుల సత్యార్తిని తీర్చే జీవ జలం దివ్య ఖుర్‌ఆన్‌. మనిషికి స్వర్గ సౌఖ్యాలను, కోరిన వరాలను అనుగ్రహించే శాంతి మార్గం ఇస్లాం. చీకటి అనే జగత్తులో విరిసిన క్రాంతి మొగ్గ, శాంతి ప్రభాకరుడు ప్రియ ప్రవక్త. అందానికే అందమైన ఆయనకు అలంకారాలు దేనికన్నట్లు దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆయన వదనం. ఆ దృశ్యం ఎంత మధురం! ఎంత ముగ్ద మనోహరం!! ఆయనే ధర్మజ్యోతి అయితే చీకట్లు పటాపంచలు కావా, శాంతి సామరస్యాలను తేవా? ప్రేమ పూరితమైన ఆయన పలుకులు మధురాను భూతులలో మైమరపించే దివ్య వాణులు. మరపురాని, మరచిపోలేని మహితోక్తులు. రండీ! విని తరించండి!!      

Wednesday, 26 March 2014

మేం మనుషుల్యం



-  శాంతి ప్రియ

మేం మనుష్యులం - మేం విశ్వాసులం
దైవ దాసులం - సత్య ప్రియులం

మనస్సు లోపలి తమస్సు తొలగించి
అణగారిన సత్యాగ్ని కణం రగిలించి
మమతానురాగాల దివ్వెలు వెలిగించి
కష్ట జనులకై లేచు కరుణ కెరటంలాగా
దుష్ట జనులకై మండు నరక కూపంలాగా
మేం పోరాటానికి సిద్ధం
గెలుపు మాకు తధ్యం

మేం ఉపాసకులం - మాకు లేదు ఏ కులం
పరలోక పిపాసకులం - శాంతి కాముకులం
ధరిత్రి థ దిశల ధర్మ తేజ తోరణాలు కట్టి
మనిషి బ్రతుక్కొక లక్యం పెట్టి, శ్రుతి చుట్టి
మాట మాటకి మంచి బాట లాగ
అడుగు అడుగుకి ఆదర్శ మూట లాగ
మేం ఖుర్‌ఆన పారాయణం చేస్తాం
మేం ప్రవక్త బాటన నడుస్తాం

మేం సత్యవంతులం - అసత్యం మాకు అప్రియం
దైవ భక్తులం - స్వర్గవాసులం
పైశాచిక పోకడల పొత్తి కడుపుల్లో కత్తులు దూసి
భుక్త భక్తుల లోగుట్టుని బయటపెట్టి
రక్త సక్త చరిత్ర రసికుల్ని మట్టుపెట్టి
రోత, రోధ, రసూముల రొంపిని పూడించి
మేం కాంతికారులై వెలుగుతాం
మేం కాత్రి వీరులై ఎదుగుతాం
మేం సుమనస్కులం - కర్కశకం కాదు మా గుణం
సాత్వికులం - సాహసవంతులం
మాలో మౌఢ్యం లేదు, మాలో క్రౌర్యం లేదు
నిమ్నోన్నతలు అసలు లేవు అంటరానితనం మా దరి చేరదు
మాకు కుర్‌ఆన్‌ ఒక గీటురాయి, ధర్మదాయి
మాకు ముహమ్మద్‌ కరుణ చినుకు తురాయిమేం వర్ణ పీడనలు సహించం
మేం మిథ్యా దేవుళ్ళను విశ్వసించం
విశ్వ మానవ సౌభ్రాతృత్వ్యం మా విశ్వకర్త హితం
విశ్వ మానవ కణ్యాణం మా విశ్వనాయకుని అభిమతం

మూఢ నమ్మకాల బూజు దులిపి
మోస మోకపు తలుపు మూసి
దర్గా దురాగల గుట్టు విప్పి
స్వార్థ సంకుచితల చిచ్చు నార్పి
మేం చైతన్య రథసారధులం
మేం నవ సమాజాన్ని స్థాపిస్తాం

ఇందుగ్గాను -
నిలవాలి మీరందరూ ధర్మానికి అండగా!
లేదంటే మీరందరి బ్రతుకులు దండగా!!

ఓ మనిషీ! పాపాల నుండి రక్షించుకో


shaik riyaz

 అల్లాహ్‌ మనిషిని స్వేచ్ఛా జీవిగా సృష్టించాడు. మనిషి ఈ స్వేచ్ఛను విని యోగించుకుని మంచి లేదా చెడు మార్గాలను అవలంబించవచ్చు. ''మరి మేమతనికి (మంచి, చెడుకు సంబం ధించిన) రెండు మార్గాలను చూపాము''. (అల్‌ బలద్‌ :10)
  మరో చోట అల్లాహ్‌ా ఇలా సెలవిస్తు న్నాడు: ''మేమతనికి మార్గం కూడా చూపాము. తద్వారా అతను కృతజ్ఞుడు అయినా కావచ్చు లేదా మేలును మరచిన వాడైనా కావచ్చు''. (అద్‌ దహ్ర్‌: 3)
 
  సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ మానవునికి శక్తియుక్తులను, స్వేచ్ఛా స్వాతంత్య్రాలనిచ్చి ఇట్టే వదలిపెట్టలేదు. అతని మార్గదర్శనం కొరకు గొప్ప ఏర్పాట్లు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి, వీరి ద్వారా సన్మార్గం ఏదో, దుర్మార్గం ఏదో చాలా చక్కగా వివరించాడు.
 
  ఎవరైతే దైవవిధేయతా మార్గాన్ని అవలంబిస్తారో వారు స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తారు. మరెవరైతే దైవ తిరస్కార మార్గమైన దుర్మార్గాన్ని అవలంబిస్తారో వారు భగభగమండే నరకాగ్నికి ఆహుతి అవుతారు. కాబట్టి మానవులందరూ పరలోకంలోని శాశ్వతమైన సుఖ సౌఖ్యాల జీవనం కొరకు ఇహలోకంలో ఒకే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్‌ను విశ్వసించి, ఆయన చూపిన మార్గాన్ని ఎన్నుకొని ఆయనకే విధేయతను చూపుతూ, ఆయన వారించిన నిషిద్ధ (హరామ్‌) పనులకు దూరంగా ఉంటూ సహనంతో జీవనం గడపాలి.  మనిషి కూడా వస్తూ ఉంటాయి. అదే విధంగా మంచితోపాటుచెడు కూడా వస్తూ ఉంటుంది. కాని నిజమైన విశ్వాసి (ముస్లిం) యొక్క   లక్షణం   ఏమిటంటే,   మంచిని    ఆస్వాదించి   చెడు   నుండి  తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. సృష్టికర్త అయిన అల్లాహ్‌ తన దాసులను పాపాల నుండి రక్షణ పొందేందుకు ఎన్నో హెచ్చరికలు చేశాడు. ముందు జాగ్రత్తలు, సూచనలను సూచించాడు.

ఆదం హవ్వా (అ)లు తప్పు చేయటం వల్లనే స్వర్గం నుంచి తీసివేయబడ్డారు
 
  పాప కారణంగానే మన మాతాపితలైన ఆదం, హవ్వా (తి)లను స్వర్గం నుంచి తీసివేయడం జరిగిందన్న విషయాన్ని ప్రతి మనిషీ ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. చివరికి షైతాన్‌ వారిని పెడ తోవ పట్టించి అక్కడి (స్వర్గం) నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: ''దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది''. అప్పుడు ఆదం (తి) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు. అల్లాహ్‌ా ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదిం చాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తా పాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను''. (అల్‌ బఖరా: 36, 37)

అల్లాహ్‌ వినేవాడు, చూచేవాడు
 
  పాపాల నుండి చాలా సులువుగా తప్పించుకోవచ్చు. అదెలా సాధ్యం? అని సందేహపడుతున్నారా! నాకు చెవులిచ్చిన ప్రభువు నా మాట వినకుండా ఉంటాడా? నాకు కండ్లనిచ్చిన ప్రభువు నేను చేసే పనులను చూడకుండా ఉంటాడా? అనే భావనను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి.
ఉదాహరణకు:- షాపింగ్‌ మాల్‌లో సీసీ కెమెరాలుంటే దొంగతనం చేయాలను కునే దొంగకు కెమెరాల ద్వారా   తనను చూస్తున్నారు అనే భయం అతనిలో చోటు చేసుకుంటే ఇక అతను దొంగ తనం చేయగలడా?
 
''భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాహ్‌ాకు తెలుసన్నది నీవు చూడటం లేదా? నాల్గవ వాడుగా అల్లాహ్‌ా లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా మంతనాలు జరుగవు. అరవ వాడుగా అల్లాహ్‌ా లేకుండా ఏ ఐదుగురి మధ్య కూడా (రహస్య మంతనాలు సాగవు.) అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, వారెక్కడ ఉన్నా - ఆయన (జ్ఞానపరంగా) వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయ దినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నీ తెలిసిన వాడు''. (అల్‌ ముజాదల:7)
 
 కాబట్టి ఎవరిలోనయితే ''నన్ను సృష్టించి, పోషించి, పాలించే ప్రభువైన అల్లాహ్‌ా ఎప్పుడూ నా వెంట ఉన్నాడు. నా ప్రతి క్రియను చూస్తున్నాడు. నా ప్రతి మాటను వింటున్నాడు. నా చూపుల చౌర్యాన్ని గమనిస్తున్నాడు. నా హృద యంలోని వాటిని సయితం ఎరిగిన వాడు'' అనే భావన ఉంటుందో అటువంటి మనిషి పాప కార్యాలు ఎలా చేయగలుగుతాడు? తన ప్రభువు పట్ల కృతఘ్నతకు ఎలా పాల్పడగలుగుతాడు? ''అల్లాహ్‌ా కళ్ళలోని మోసాన్ని, గుండెల్లోని గుట్టును సయితం (బాగా) ఎరిగినవాడు''. (అల్‌ మూమిన్‌: 19)

దైవ దూతలు రికార్డు తయారు చేస్తున్నారు
  మనిషి తను చేసే ప్రతి పనిని, తను పలికే ప్రతి పలుకునూ దైవ దూతలు వ్రాస్తున్నారు. రేపు ప్రళయ దినాన వీటిని బట్టి లెఖ్క తీసుకోబడుతుంది. ఆ తర్వాత స్వర్గమో, నరకమో ఖరారు చేయబడు తుంది. ఈ విషయాన్ని ప్రతి వ్యక్తీ స్మరించుకుంటూ ఉండాలి.   ''నిశ్చయంగా మీపైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు''. (అల్‌ ఇన్ఫితార్‌: 10-12)
 
  వేరొక చోట అల్లాహ్‌ా ఇలా సెలవిస్తు న్నాడు: ''మేమే మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సయితం మాకు తెలుసు. మేమతని ప్రాణనాళం కంటే కూడా అతి చేరువలో ఉన్నాం. అతని వద్దకు వెళ్ళిన ఇద్దరు దైవదూతలు అతని కుడి, ఎడమల వైపు కూర్చొని ఉంటారు. మనిషి నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయటానికి) సిద్ధంగా ఉంటాడు''. (ఖాఫ్‌: 16-18)
పాపం చేెసే ముందు మృత్యువును గుర్తు చేసుకోవాలి

  పాపానికి పాల్పడే ముందు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే కూడా తలపెట్ట బోయే పాపం నుండి మనల్ని రక్షించుకో వచ్చు. ఎందుకంటే మరణం ఒక పచ్చి నిజం. అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా సంభ విస్తుందో కూడా ఎవరికీ తెలియదు. దాన్నుండి ఎవ్వరూ తప్పించు కోలేరు.
 
  ''ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడ వలసినదే. ప్రళయ దినాన మీరందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుండి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించ బడతాడో అతడు నిశ్చయంగా సఫలీ కృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు''. (ఆలి ఇమ్రాన్‌: 185)
 
  సోదరులారా! మనిషి పాపం చేస్తున్న ప్పుడు విశ్వాసం నుంచి తిరిగి పోతాడు.అవిశ్వాస స్థితిలో ఉంటాడు. ఒకవేళ పాపం చేస్తున్న సమయంలోనే మరణం సంభవిస్తే ఇక అతని పరిస్థితి ఏమిటి? ఎవరు అతనిని రక్షిస్తారు? పశ్చాత్తాపం చెందే సమయం కూడా దొరకదాయె!

మన శరీరావయవాలు మనకు  వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి

  ఒకవేళ మనం పాపాలకు పాల్పడితే రేపు ప్రళయం రోజు మన శరీరా వయవాలైన కాళ్ళూ, చేతులు, నోరు, చర్మం మొదలగునవి అల్లాహ్‌ా ముందర సాక్ష్యమిస్తాయన్న సంగతి ఆలోచిస్తూ ఉండాలి. ''ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్ళూ, వారి చర్మాలు సయితం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి. ''మీరు మాకు వ్యతిరే కంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు''? అని వారు తమ చర్మాలనుద్దేశించి అడుగు తారు. ''అన్ని వస్తువులకు మాట్లాడే శక్తిని చ్చిన అల్లాహ్‌యే మాకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు'' అని అవి సమాధానమిస్తాయి.(హామీమ్‌ అస్సజ్దహ్‌: 20,21)

ప్రళయం రోజున పాపాత్ములు  పశ్చాత్తాపంతో కుమిలి పోతారు.
 
  ఇహలోకంలో సృష్టికర్త అయిన అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను, గ్రంథాలను తిరస్కరించి తన ఇష్టమొచ్చినట్లు పాపాల మీద పాపాలు చేస్తూ పోయే వ్యక్తి మరణ సమయంలోగానీ, ప్రళయ దినానగాని పశ్చాత్తాపంతో అల్లాహ్‌ాను వేడుకుం టాడు. కాని ఏం లాభం? ఆ రోజు ఆ పశ్చాత్తాపాన్ని ప్రభువైన అల్లాహ్‌ా అంగీ కరించడు. తిరిగి సత్కార్యాలు చేసే దానికి భూలోకంలోకి పంపించ డమూ జరుగదు. ''చివరికి వారిలో ఎవరికైనను చావు వచ్చినప్పుడు 'ఓ మా ప్రభూ! నన్ను వెనక్కి పంపించు. నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను'' అని అంటాడు. ముమ్మాటికి అలా జరుగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డు తెర ఉటుంది''. (అల్‌ మోమినూన్‌: 99,100)
 
  వేరొక చోట ఇలా ఉంది: ''ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులు కొరుక్కుంటూ ఇలా అంటాడు: ''అయ్యో! నేను దైవప్రవక్త మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత  బాగుండేది!    అయ్యో! నా పాడుగాను! నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది! నా వద్దకు ఉపదేశం  వచ్చిన  తర్వాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతెనా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే''.   (అల్‌ ఫుర్ఖాన్‌: 27-29)

పాపాలు శాపాలకు గురవుతాయి
 
 పాపాల వలన మనిషి పరువు పోయి, నలుగురిలో నవ్వుల పాలవుతాడు. ఇంకా శాపానికి గురి అవుతాడు. ''ఇస్రాయీలు సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మర్యం పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధే యతకు పాల్పడేవారు. హద్దు మీరి ప్రవర్తించేవారు''. (అల్‌ మాయిదా: 78)

 శపించబడటం అంటే, దైవ కారుణ్యా నికి, శ్రేయోసాఫల్యాలకు దూరంగా ఉంచటం అని భావం. ఈ శాపానికి రెండు కారణాలు: 1) అల్లాహ్‌ా విధించిన వాటిని నెరవేర్చకుండా ఉండటం. హరాం (నిషిద్ధ) విషయాల వెంట పడటం. 2) ధర్మం విషయంలో అతిశ యిల్లటం. లేనిపోని వాటిని ధర్మంలో జొప్పించి, దాని రూపురేఖలను మార్చి వేయటం. (అహ్సనుల్‌ బయాన్‌ - తెలుగు - పేజీ: 524)
 
సోదర సోదరీమణులారా! పాపాలన్నిం టిలో అతి ఘోరమైన,  క్షమించరాని పాపం సర్వ లోకాలకు ఒకే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్‌ాను విశ్వసించకుండా, ఆయన సృష్టించిన సృష్టితాలను ఆయనకు సహవర్తులుగా (షిర్క్‌) చేయడటం. రెండవది: దేవుడు విధించిన ఆజ్ఞలను పాటించకుండా (హరాం) నిషిద్ధ మైన పనులు చేయటం. ఎవరైతే ఇటు వంటి పాపాలకు పాల్పడుతున్నారో వెంటనే ఆ పాపాలను వదిలేసి పశ్చాత్తాపం చేసుకొని పైన తెలిపిన విషయాలను గనక ప్రతి వేళ గుర్తు చసుకుంటూ జాగ్రత్తను వహిస్తే ఇన్షాఅల్లాహ్‌ా  పాపాల నుండి రక్షణ పొందవచ్చు.

Tuesday, 18 March 2014

సామ,దాన, భేద, దండోపాయం


సయ్యిద్ అబ్డుస్సలాం ఉమ్రీ

 కెరటాల నురుగు చూసి, సాగర సామర్థ్యాన్ని  అంచనా వేసి నట్లు, మక్కా ప్రజలు ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి సందేశాన్ని చిన్న చూపు చూశారు. దాన్ని చాలా తేలికైన విషయంగా భావిం చారు. ఆయన (స) సందేశం సత్య సస్య విప్లవానికి నాంది అని వారు ఆ క్షణంలో గ్రహించలేకపోయారు. జీవిత వాస్తవమే సత్యం. దాని ఆది ఏ గర్భంలోనూ లేదు. దాని అంతం ఏ సమా ధిలోనూ లేదు. అది నిత్యం, నూతనం, నిర్మలం. అది నిజం- మారని ఇజం. ఇది గ్రహించే స్థితిలో లేని మక్కా అవిశ్వాసులు సత్య సస్య విప్లవ జ్యోతిని తమ నోళ్ళుతో ఊది అర్పివేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారు అవలంబించిన విధానం - సామ, దాన, భేద, దండోపాయం. అదేలాగంటే-,
 
 'ఒక సంవత్సరం కాలం పాటు నీవు మా దేవతలను పూజిస్తే, (ప్రతిగా) ఒక సంవత్సరం కాలం పాటు మేము నీ ఆరాధ్య దైవాన్ని పూజిస్తాము' అని అవిశ్వాసులు మహా ప్రవక్త (స) వారి ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. అది విన్న మహా ప్రవక్త ముహ మ్మద్‌ (స) దివ్యావిష్కృతి ద్వారా అందిన సమాధానాన్ని వారికి విన్పించారు: '(ఓ అవిశ్వాసుల్లారా! మీరు మీ మిథ్యా దేవీదేవతల ను వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు నేను నా నిజ దైవాన్ని ఎందుకు వదులుకోవాలి. నేను నా ధర్మంపై సంతోషంగా ఉన్నాను. మా కర్మలు మావి. మీ కర్మలు మీవి''. (అల్‌ ఖసస్‌: 55)
 
 పరస్పర సలహాసంప్రదింపుల (సామ పద్ధతి) ద్వారా సమస్య తేలేటట్టు లేదని గ్రహించిన మక్కా అవిశ్వాసులు మరో కుయుక్తి సిద్ధమయ్యారు. అదే పని మీద ఉత్బా అను రాయబారిని మహా ప్రవక్త (స) వారి వద్దకు పంపారు.

ఉత్బా: నాయనా ముహమ్మద్‌! అనుభవంలోనూ, ఆయుష్షులోనూ నేను నీకన్నా పెద్దవాడను. నా మాట విను. నేను చెబుతున్నది నీ మేలు కోరే - నీ ఈ ప్రచారాన్ని మానుకో. ఒకవేళ నువ్వీ పని చేయడంలోని ఉద్దేశ్యం - సిరిసంపదలు కూడబెట్టుకోవడమే అయితే చెప్పు. మేమే స్వయంగా కనక సామగ్రినంతా నీ కాళ్ళ దగ్గర పడవేస్తాము. ఒకవేళ సమాజంలో గౌరవమర్యాదల కోసం నువ్వీ పని చేస్తున్నట్లయితే చెప్పు. మేము నిన్ను మా నాయకుని గా చేసుకుంటాము. ఒకవేళ నువ్వీ కార్యం వల్ల అధికారాన్నే కాంక్షిస్తున్నయితే చెప్పు. మేము నిన్ను పూర్తి అరబ్బు దేశానికే రాజుగా చేెసుకుంటాము. పోని నీ ఈ ప్రచారం వెనకాల స్త్రీ వ్యా మోహం పని చేస్తున్నట్లయితే ఫరవాలేదు చెప్పు. పూర్తి అరబ్బు దేశంలోని అందమైన స్త్రీని నీకిచ్చి పెళ్ళి చేస్తాము. లేదా నీ మెదడుకేమైనా రోగం సోకిందా, నీకేదైనా భూతం పట్టిందా చెప్పు. మంచి వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేస్తాము. నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి, నీవు కోరిందల్లా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నీకేం కావాలో నిర్మోహమాటంగా అడుగు. కానీ నీ ఈ సందేశ ప్రచారాన్ని మానుకో' అని (దాన పద్థని ముందుంచి) మాట పూర్తి చేశాడు ఉత్బా.

 సాంతం విన్న మహా ప్రవక్త (స) అతనితో ''ఇప్పటి వరకూ నువ్వు నాతో అన్న మాటల్లో ఇసుమంతయినా నిజం లేదు. ఆ విషయం నీకు తెలియంది కాదు. ఈ కార్యం ద్వారా ఎలాంటి సిరిసంపదలు, పరువుప్రతిష్టలు నాకక్కరలేదు. నేను దీని ద్వారా అధికారాన్నిగానీ, ఆడదాన్నిగాన్నీ కోరుకోవడం లేదు. నా ఆరోగ్య స్థితి కూడా బాగానే ఉంది. నాపై అవతరించిన గ్రంథంలోని ఈ వాక్యాలు విను. నా సందేశంలోని వాస్తవికత ఏమిటో నీకే బోధ పడుతుంది'' అంటూ పవిత్ర ఖుర్‌ఆన్‌ పారాయణం మొదలు పెట్టారు. హామీమ్‌ అస్సజ్దాలోని ప్రారంభ వాక్యాలను చదివి విన్పించారు.
  అరచేతిని నేలకు ఆనించి తల భుజంపై వాల్చి మహా ప్రవక్త (స) వారి నోట నుండి వెలువడుతున్న దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తుల్ని తన్మయుడై వినసాగాడు. అంతా విన్న తర్వాత మారు మాట్లాడ కుండా లేచి ఖురైషు దగ్గరకు చేరుకుని: 'ఖురైషీయుల్లారా! నేనో అద్భుతమైన వాణిని విని వచ్చాను. అది కవిత్వం కాదు. చేతబడి అంతకన్నా కాదు. మంత్రజాలం అసలే కాదు. మీరు నా మాట వినండి! ముహమ్మద్‌ (స)ను అతని మానాన అతన్ని వదిలె య్యండి'  అన్నాడు. ఈ వైఫల్యం తర్వాత అవిశ్వాసులకు ఎటూ పాలుపోలేదు. చివరికి సర్దారులందరూ వెళ్లి ప్రవక్త (స) వారి బాబాయి అబూ తాలిబ్‌తో మాట్లాడాలన్న నిర్ణయానికి వచ్చారు. అంటే భేద పద్ధతికి ప్రారంభం అన్న మాట.

ఖురైషీయులు: 'అబుతాలిబ్‌ మహాశయా! మీరు మా పెద్దలు. మీ పట్ల మా హృదయంలో ఎంత గౌరవం ఉందో మీకు తెలుసు. ముహమ్మద్‌ విషయంలో మాకు న్యాయం చేయండి. అతడ్ని కాస్త మందలించండి. మా మతాన్ని, మా ఆచార విధానాల్ని విమ ర్శించ వద్దని నచ్చజెప్పండి. లేదా మా దారి నుండి తప్పు కోండి' అన్నారు. అది విన్న అబూతాలిబ్‌ ప్రవక్త(స)ను పిలిపించి బాబూ ముహమ్మద్‌! నీ పద్దతి మార్చుకో అన్నారు.
ముహమ్మద్‌ (స): 'బాబాయీ! ఎందులో వారి శ్రేయస్సు, సంక్షే మాలు దాగి ఉన్నాయో దాని వైపు వారిని పిలవడం మానెయ్య మంటున్నారా?'.
అబూ తాలిబ్‌: 'అదేమిటి? ఎందులో ఉంది వారి శ్రేయస్సు'?
ముహమ్మద్‌ (స): ఒక సద్వచనం. దీన్ని గనక వారు మనసా వాచ, కర్మణ-త్రికరణ శుద్ధితో అంగీకరిస్తే అరేబియా,  అరబ్బే తర దేశాలు వారికి దాసోహం అంటాయి.
అబూ జహల్‌: ముహమ్మద్‌ నువ్వు విశ్వసించే ఆ దేవుని సాక్షి! ఆ మాటేమిటో చెప్పు, ఇప్పుడే అలాంటివి ఒకటేమిటి ఖర్మ, పాతిక మాటలు పలకటాని మేము సిద్దంగా ఉన్నాము అన్నాడు కుతుహా లంతో.
ముహమ్మద్‌ (స):  ఖూలూ లా  ఇలాహ ఇల్లల్లాహ్‌ తుఫ్లిహూ' -   కేవలం అల్లాహ్‌ా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని చెప్పండి. సాఫల్యం మీ సొంతం అవుతుంది. దైవప్రవక్త (స) వారి నోట ఈ మాట వినగానే అక్కడున్న వారి ముఖాలు కోపంతో ఎర్రబడ్డాయి. 'చూడు చివరికి నీ గతి ఏమవుతుందో' అంటూ లేచి చరచరా వెళ్ళిపోయారు.

అయినా ఇస్లామీయ ఉద్యమం ఉధృతం అవుతూనే ఉంది. ఉమర్‌, హమ్జా లాంటి పరాక్రమవంతులు కూడా ఇస్లాం స్వీకరించారు. మరోవైపు నజాషీ రాజు ముస్ల్లింలను తన రాజ్యంలో రక్షణ కల్పించాడు. అది విస్తరించే కొద్దీ వారి మనోవేదన సయి తం అధికమవుతూ ఉంది. దినదిన ప్రవర్థమాన మవుతున్న ప్రవక్త (స) వారి సహచరుల సంఖ్యను చూసి వారు మరింత కలవర పడ్డారు. కొంగ్రొత్త వ్యూహలను రచిస్తూ, అలగా జనాలను ఉసి గోల్పారు. దాంతో వారు విశ్వాసులకు పెట్టే హింసలు మిన్నం టాయి. దైవ ప్రవక్త (స)ను, ఆయన వంశం వారిని సంఘం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వారు జారీ చేసిన తీర్మాన పత్రం ప్రకారం - మక్కాలో ఎవరూ హాషిమ్‌ తెగవారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరాదు. వారితో ఎలాంటి లావాదే వీలు జరుపకూడదు. వారిని కలుసుకోకూడదు. వారికి అన్న పానీయాలు అందకుండా, కనీస అవసరాలు తీరకుండా గట్టి చర్యలు గైకొనాలి. ఈ దిగ్బంధం మూడేండ్ల పాటు సాగింది. ఈ మధ్య కాలంలో చెట్టు ఆకుల్ని తిని బ్రతికారు. ఎండు చర్మాన్ని నీళ్ళల్లో నానబెటుట్టుకుని కడుపు మంట చల్లార్చుకున్నారు. పసి పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. వారు ఆకలికి తాళలేక బోరున  ఏడ్చేవారు. ఆ ఏడ్పుల శబ్దం విని మక్కా అవిశ్వాసులు పగలిబడి నవ్వి పైశాచికానందం పొందేవారు. అయినా ప్రవక్త (స) పోరాట పటిమను ఆపలేదు. చివరికి ఆ గడ్డు ఘడియలు కూడా ముగిశాయి. ధర్మపథంలో ఒకదాని వెంట మరొకటి చొప్పున ముందుకొస్తున్న అనేక సమస్యల్ని అధికమించి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో ఓ ప్రతిపాదనకు బదులుగా ఆయన నోట ఈ మాటలు వెలు వడ్డాయి ''బాబాయి! దైవసాక్షి! వీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, ఎడమ చేతిలో చంద్రుడ్ని తెచ్చి పెట్టి ఈ మహా కార్యం మాను కోమన్నా అది జరిగే పని కాదు. వినండి, ఈ మహా కార్యం పూర్తయినా పూర్తి కావాలి. లేదా ఈ మార్గంలో నా ప్రాణమైనా పోవాలి''.

ఇది జరిగిన కొంత కాలానికి  అడుగడుగునా సహా యం అందిస్తూ వచ్చిన అబూ తాలిబ్‌, తనను వెన్ను తట్టి ప్రోత్స హించిన ప్రియ సతీమణి ఖదీజా (ర) పరమపదించారు. దీంతో అవిశ్వాసుల భేధం, దండోపాయంగా రూపు దాల్చింది. వారి అసభ్య ప్రహేళికలు, తుంటరి చేష్టలు విపరీతమయ్యాయి. ఒకడు ఆయన (స) పై బురదపోసి, మరొకడు మెడలో త్రాడు వేసి బిగించి, ఇంకొ కడు దారిలో ముళ్లు పరచి, రాళ్ళతో కొట్టి శారీరకంగా వేధిస్త్తే, ఇంకొందరు ఆయన కుమార్తెలకు విడాకులిచ్చి మానసికంగా హింసించారు. అయినా ఆయన (స) ఏ మాత్రం నిరాశనిస్పృహ లకు లోను కాలేదు. ఆ రోజుల్లోనే తాయిఫ్‌ పట్టణానికి కూడా వెళ్ళి ధర్మప్రచారం చేసి వచ్చారు. ఆ కాలంలోనే మేరాజ్‌ సంఘ టన, మొదటి, రెండవ అఖ్బా ఒప్పం దాలు చోటు చేెసుకున్నాయి. ముస్లింలు మదీనాకు వెళ్లనారంభించింది కూడా ఆ రోజుల్లోనే.

 ఇస్లాం మదీనాలో క్రమక్రమంగా నిలదొక్కుకోసాగింది. అక్కడ ఇస్లాం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటం చూసి మక్కా అవిశ్వాసులు జీర్ణించుకోలేకపోయారు. అందుచేత వారు పార్లమెంటులో ఓ సార్వ త్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి అందరు సర్దా రులతోపాటు షైతాను కుడా ఓ వృద్ధుని వేషంలో వచ్చాడు. చివరిగా 'మన తెగల్లో ఒక్కో తెగ నుండి కనీసం ఒక వ్యక్తి ముందుకు రావాలి. ఆ తర్వాత అందరూ కలిసి ఒక్కసారిగా ఖడ్గాలతో దాడి చేసి ముహమ్మద్‌ (స)ను మట్టు బెట్టాలి' అని తీర్మానించారు. తర్వాత కాలం ఇటువంటి కుయుక్తులు, కుట్రలు కోకొల్లలుగా సాగాయి. అయినా అంతిమ విజయం సత్యానికే వరించింది. సత్యప్రవక్త ముహమ్మద్‌ (స) హృదయాల విజేతగా మక్కాలో ప్రవేశించారు.
 
 ముస్లింలు కొన్ని శతాబ్దులపాటు ప్రపంచాన్ని పరిపాలించిన తర్వాత నేడు కాలం మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది. ఇస్లాం ధర్మం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడం చూసి జీర్ణించుకోలేని కొన్ని రాజ్యాలు, వ్యక్తులు సత్య ధర్మ ప్రవాహాన్ని అడ్డు కోవాలని తిరిగి మళ్ళీ ఆ ప్రాచీన అస్త్రాలైన 'సామ, దాన, భేద, దండోపాయా'ల ను ప్రయోగిస్తున్నారు. వారి కుయుక్తుల్ని, కుట్రల్ని నిశితంగా పరిశీలిస్తే ఇస్లాంను అనుమానాస్పదంగా చీత్రీకరించేందుకు వారు అవలంబిస్తున్న మార్గాలు ఇవి -

1) ఇస్లాం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా అపోహాల్ని, అపార్థాల్ని సృష్టించడం. 2) విద్యా రంగంలో సిలబస్‌ మార్పుచేర్పుల ద్వారా ముస్లింల చరిత్రను వక్రీకరించడం. 3) దివ్యఖుర్‌ఆన్‌ వచనాల్ని, ప్రవక్త (స) వారి ప్రవచనాల్ని వాటి నిజ స్థానం నుండి వేరు పర్చి పెడర్థాలు కల్పించడం. 4) ఇస్లాం పారభాషికాలను తప్పుడు అర్థాలు ఇవ్వడం. ఉ: జిహాద్‌ అంటే పవిత్ర యుద్ధం అని చెప్పడం. 5) అపనిందలు మోపడం. ఉ: ఇస్లాం కత్తి బలంతో వ్యాపించిందని నమ్మ బలకడం. 6) ఇస్లాం ఆదేశాల్ని ప్రగతికి ప్రతిబంధకాలుగా పేర్కొన డం. ఉ: పరదా విషయంలో చేయబడుతున్న దుష్ప్రచారం. 7) ముస్లింలలోని అతివాదులను ప్రోత్సహించి ఇస్లాంపై బురద జల్లేం దుకు ప్రయత్నించడం. ఉ: సల్మాన్‌ రష్దీ. 8) ఉగ్రవాద చర్యలు ఎక్కడ జరిగినా, ఎవరూ చేసినా ముందుగా ముస్లింలనే పేర్కొనడం. తర్వాత నిజానిజాలు తెలిసినా వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వక పోవడం. 9) దేశ ప్రగతి కోసం, స్వాతంత్య్రం కోసం ముస్లిం యోధులు సాగించిన పోరాటానికి పాఠ్య పుస్తకాల్లో చోటు కల్పించక పోవడం, ముస్లింల సేవల్ని విస్మరించి, ముస్లిం సైంటిస్టుల పేర్లు మార్చి ప్రచారం చేయ డం. ఉ: ఈసా అలీ బదులు జేసు హాలి అన డం. 10) కొత్త కొత్త పారభాషికాలను సృష్టించి ఇస్లాంను ఒక ఫోబియాగా చిత్రీకరించడం.
 గత 11 సంవత్సరాలలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్రాయబడిన పుస్తకాల సంఖ్య అక్షరాల 2640 అంటే దుష్ప్రచారం ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించవచ్చు. ఎన్ని కుట్రలు పన్నినా, మరెన్ని ఎత్తుగడలు వేసినా ఇస్లాం మాత్రం దినదిన ప్రవర్థ మానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది అని స్వయంగా అల్లాహ్‌ మాట ఇస్తున్నాడు: ''వారు అల్లాహ్‌ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్‌ - అవిశ్వాసులకు ఎంతగా సహించరాని దైనా సరే - తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలి పెట్టడానికి అంగీకరించడు. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్య ధర్మాన్నీ ఇచ్చి పంపాడు. ముష్రికులకు ఎంత అయిష్టంగా ఉన్నా సరే, ఇతర జీవన విధానాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి''.
(తౌబా: 33)
  పై పేర్కొనబడిన థ కుయుక్తుల్లో అత్యధికంగా ప్రింటింగ్‌ మీడియా మరియు ఎలక్ట్రానిక్‌ మీడియాతో ముడిపడి ఉన్నవే. ప్రతి మూడు రోజుల్లో రెండు పుస్తకాలు ఇస్లాంకు వ్యతిరేకంగా వ్రాయబడుతున్నా,  ఇంత జరుగుతున్నా ముస్లిం ప్రపంచం నిద్ర మత్తులోనే ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. ఇస్లాం వాస్తవికతను తెలుయపర్చే పుస్తకం నెలకోక్కటి కూడా రాకపోవడం, దాని కోసం కట్టుదిట్టంగా పని చేసే ఒక వ్యవస్థ లేకపోవడం ముస్లిం సమాజ నిర్లక్ష్యానికి, ఏమరుపాటుకి ప్రబల తార్కాణం. ఇది చాలదన్నట్లు ఆధునిక రంగాల్లో ముందుకు దూసుకెళ్లే దమ్ము, ధైర్యమూ ఉన్న యువకుల్ని వ్యర్థ రాజకీయాల్లోకి లాగి, స్వార్థ, స్వల్ప ప్రయోజనాల కోసం తగువులాటల్లో, తగాదాల్లో వారి ప్రతిభాపాటవాలను దుర్వినియోగం చేయడం అత్యంత దారుణం! 'అల్లాహ్‌ త్రాడును గట్టి పట్టుకోండి. విభేదాల్లో పడి చీలి పోకండి' అని దేవుడు పదే పదే పిలుపునిస్తుంటే వ్యక్తిగత పగలు ప్రతీకారాలు పెంచుకొని బ్రతకడం మిక్కిలి విచారకరం! పతనంలో ముందున్న మన మిగతా అన్నింటిలోనూ వెనుకబడి ఉండ టానికి కారకులు ఎవరు?

ఇక వెబ్‌సైట్లు, బ్లాగర్ల విషయానికొస్తే  జానాభా పరంగా ప్రపంచం లోనే రెండో అతి పెద్ద సంఖ్యలో ఉండి కూడా ఇక్కడ సయితం అన్ని మతాల వారికన్నా వెనుకబడి ఉన్నది మనమే. చూడండి -

గూగల్‌
యూదులు   బౌద్ధులు     క్రైస్తవులు     ముస్లింలు
3098       3788     92883       1953
                           
 యాహు
యూదులు   బౌద్ధులు     క్రైస్తవులు     ముస్లింలు
 2961      594        25365       1418

అభిమాన సోదరులారా! ఆధారాల రీత్యా, ప్రమాణాల రీత్యా 'ఆధిక్యత' అనేది ఇస్లాంకు ఎప్పటికీ ఉంటుంది. అయితే ముస్లింలు ధర్మపరా యణులుగా, రుజువర్తనులుగా వ్యవహరించిన నాడు ప్రాపంచికంగా కూడా వారికి ఆధిక్యత ప్రాప్తించింది. ఇప్పటికయినా సరే ముస్లింలు తమ ఆశయాన్ని గుర్తించి, విద్యా-వైద్య-వైజ్ఞానిక-రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ, రుజుమార్గంలో పయనిస్తే ప్రాబల్యం ఖాయం. ఎందుకంటే ఏనాటికైనా అల్లాహ్‌ా పక్షం వారే విజయం సాదిస్తారని దేవుడు వాగ్దానం చేెసి ఉన్నాడు. ఇక అల్లాహ్‌ా తోడ్పాటుకు కావలసిన అర్హత ముస్లింలమైన మనం సంపాదించుకోవడమే ఆలస్యం.కారణం-
 ''ఏ జాతి అయినా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంత వరకూ అల్లాహ్‌ా కూడా దాని స్థితిని మార్చడు''. (అర్రాద్‌: 11)